రాత్రిపూట సెల్‌ఫోన్ వాడితే డేంజర్
ఈ జబ్బు వస్తుందంట: బీ కేర్ ఫుల్
నైట్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల వాటి నుండి వచ్చే నీలిరంగు కాంతి విడుదలై అది టైప్–2 డయాబెటిస్కు దారితీస్తుందని తాజా అధ్యయనం వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడే
వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ వ్యాధిని
నిర్మూలించేందుకు సరైన మందులు లేవన్నది అందరికీ తెలిసిందే. ఐతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో కేవలం రక్తంలోని చక్కెర స్థాయిలను
మాత్రమే అదుపులోకి తేవచ్చు. అయితే, ఆ మందులను దీర్ఘకాలికంగా వాడితే అనేక
సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల టైప్–2 డయాబెటిస్ రాకుండా
అత్యంత జాగ్రత్త వహించాలి. టైప్–2 డయాబెటిస్ రావడానికి గల కారణాలపై ఎక్కువ దృష్టి
పెట్టాలి. రాత్రిపూట ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల వాటి నుండి
నీలిరంగు కాంతి విడుదలై అది టైప్–2 డయాబెటిస్కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో
తేలింది. అంతేకాక, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే
నీలిరంగు కాంతికి గురవ్వడం వల్ల వ్యక్తి ఆకలి పెరగడమే కాకుండా అతని జీవక్రియ
మెరుగవుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. మసక కాంతి ఎక్స్పోజర్తో పోలిస్తే బ్లూ
లైట్ ఎక్స్పోజర్ ఆకలి పెరుగుదలతో ముడిపడి ఉందని ఈ పరిశోధనలో కనుగొనబడింది.
ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే నీలిరంగు కాంతి నిద్రను తగ్గిస్తుందని, ఇది క్రమంగా శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత చర్యలకు దారితీసిందని పరిశోధన
పేర్కొంది. ల్యాప్‌టాప్, మొబైల్ మొదలైన వాటి నుండి అధిక
స్థాయిలో వెదజల్లే నీలిరంగు కాంతి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తీవ్రమవుతుందని
పరిశోధన వెల్లడించింది.
19 మంది ఆరోగ్యవంతులపై జరిపిన పరిశోధన
ఉద్యోగంలో భాగంగా కొందరు నైట్ డ్యూటీలు
చేస్తుంటారు. నైట్ డ్యూటీల వల్ల వారి ఆరోగ్యానికి ముప్పేనని పరిశోధకులు
హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ప్రాణంతకమైన గుండె జబ్బులు, టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వారు వెల్లడిస్తున్నారు.
వారంలో ఎవరైతే ఎక్కువ రోజులు నైట్ డ్యూటీలు చేయడం, తరచూ షిఫ్ట్లు మారుతుంటారో వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని
పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా 19 మంది ఆరోగ్యవంతులపై నాలుగు రోజుల
పాటు వివిధ కాంతి పరిస్థితులలో పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. రాత్రి పూట ఎక్కువ
సేపు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడిన వారిలో గ్లూకోజ్, ఇన్సులిన్, కార్టిసాల్, లెప్టిన్, గ్రెలిన్ స్థాయిలను పరిశీలించారు. మసక
కాంతితో పోలిస్తే నీలిరంగు కాంతిలో ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడిన
వారిలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా పెరిగాయని ఈ పరిశీలనలో తేలింది.
దీనిపై అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్
ఐవీ చెయుంగ్ మాసన్ మాట్లాడుతూ ‘‘కాంతి బహిర్గతం అయ్యే రాత్రి సమయంలో బ్లూ లైట్
కింద పనిచేసే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీవ్రంగా ప్రభావితం అవుతుందని మా
ప్రాథమిక పరిశోధనలో తేలింది. రాత్రి పూట కాంతి బహిర్గతం నిద్రకు అంతరాయం
కలిగిస్తుంది. దీని వల్ల శరీరం ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా
ఇది ఆకలి, అధిక రక్తపోటు, బరువు పెరగడానికి దారితీస్తుంది.’’ అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం
కాబట్టి సరైన రీతిలో ఆహారం మితంగా తీసుకొని చక్కని ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి.
Comments
Post a Comment