లాక్‌డౌన్ అంటే ఏంటి..? ఏమేమి చేయొచ్చు ?
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే..పదికి పైగా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో అసలు లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదని అనుమానం చాలా మందిలో కలుగుతోంది. అలాగే, లాక్ డౌన్ సమయంలో అన్నీ మూసేస్తే బతికేదెలా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే, మొదటగా అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దులకు అవతలే నిలిపివేస్తారు. కేవలం అత్యవసరం అయినవి మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ మార్చి 31 వరకు రద్దు చేసింది.
కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్ చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ ఉన్నవారిని కనుగొనడం వారిని వేరుచేయడం, వారి పరిచయాలను కనుగొని వారిని వేరుచేయడం వంటి వాటిపైన మనం నిజంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అంటోంది. బలమైన ప్రజారోగ్య చర్యలను ఉంచకపోతే, ఆ కదలిక ఆంక్షలు మరియు లాక్ డౌన్ ఎత్తివేసినప్పుడు ప్రమాదం ఏంటంటే వ్యాధి తిరిగి ముదిరే అవకాశం ఉంది. చాలా యూరప్ దేశాలు, యునైటెడ్ స్టేట్స్ చాలావరకు చైనా మరియు ఇతర ఆసియా దేశాలను అనుసరించాయి. కరోనా వైరస్ పై పోరాడటానికి తీవ్రమైన ఆంక్షలను ప్రవేశపెట్టాయి. పాఠశాలలు, బార్లు, పబ్బులు మరియు రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి. ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగుల్ని ఆదేశించాయి.
దేశవ్యాప్తంగా పదికి పైగా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ కాలంలో అత్యవసర సర్వీసులు మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు లాక్ డౌన్ సమయంలో పూర్తి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్స్, పోలీసులు, మీడియా, అగ్నిమాపక సిబ్బంది, పెట్రోల్ బంకుల సిబ్బంది పనిచేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. వీరితో పాటు విద్యుత్, మున్సిపల్, పారిశుధ్య విభాగాలు కూడా యధావిధిగా పనిచేస్తాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఉద్యోగుల్ని బ్యాచ్ ల వారీగా విభజించి ఆఫీసులకు రమ్మని చెబుతున్నారు.
ప్రజలు చేయకూడని పనులివే ?
లాక్ డౌన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి తిరగకూడదు. ఫంక్షన్లు, విహారయాత్రలు, జనం గుంపులుగా చేరే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. జనం ఒకే ప్రదేశంలో గుంపులు గుంపులుగా ఉండకూడదు. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజుల పాటు ఇంటికే పరిమితమవ్వాలి. ప్రజలకు నిత్యావసర వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
10 ఏళ్ళు దాటిన చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటికే పరిమితమవ్వాలి. దేవాలయాలు, మసీదులు, చర్చీలు కూడా మూసివేయబడతాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు కొన్ని పనులు మాత్రం చేయవచ్చు. ప్రజలు ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. నచ్చిన వస్తువులను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
అత్యవసరం అయితే టికెట్ ఉన్నవారు డొమెస్టిక్ ఫ్లెయిట్స్ ద్వారా ప్రయాణం చేయవచ్చు. ప్రజలకు పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయి. అత్యవసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంటి నుంచి ఒక్కరే బయటకు వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఇతరులకు రెండు లేదా మూడు మీటర్ల దూరం ఉండాలి. ఈ నెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి సీఎం జగన్, కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించాలా..? వద్దా...? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Post a Comment